జర్మనీ, సింగపూర్, బ్రిటన్, రష్యా, చైనా వంటి దేశాల్లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది (Covid cases are on the rise). అంతర్జాతీయ రాకపోకలు యథాస్థితికి చేరుకున్న నేపథ్యంలో కొత్తవేరియంట్లు భారత్‌లోకి ప్రవేశించే ముప్పు ఉందని, అది మూడోదశ ఉద్ధృతికి (covid third wave) దారితీయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
సమృద్ధిగా టీకాలు.. అయినా వెనకడుగు
ఈ నెలలో ఇప్పటికే కొవిషీల్డ్ (covishield) 15,64,890, కొవాగ్జిన్ (Covaxin) 5,12,980 కలుపుకొని మొత్తంగా 20,77,870 డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా కొవిషీల్డ్ మరో 43,57,590, కొవాగ్జిన్ 9,18,470 డోసులు రాష్ట్రానికి రానున్నాయి. రోజుకు 3-4 లక్షల డోసులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ (Department of Medical Health) ప్రకటించింది. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో 3,085 కేంద్రాలు, ప్రైవేటు వైద్యంలో 141 కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల నుంచి మాత్రం ఆశించిన స్పందన రావడం లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ‘‘సగటున రోజుకు 2 లక్షల మందికి మించి టీకాలను పొందడానికి ముందుకు రావడంలేదు.
రాష్ట్రంలోని లక్షిత జనాభాలో ఇప్పటివరకూ 84.3 శాతం మంది తొలిడోసు స్వీకరించారు. 38.5 శాతం మందే రెండు డోసులూ స్వీకరించారు. రెండోడోసు స్వీకరించని వారి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నప్పటికీ అనుకున్నంత ఫలితం రావడం లేదు. ఉదాహరణకు గత నెల 26న రెండోడోసు స్వీకరించాల్సిన వారు 30,70,983 మంది ఉన్నారు. ఇప్పటివరకూ వారిలో కేవలం 39 శాతం మాత్రమే ముందుకొచ్చారు. మొత్తంగా ఇంకా 18,79,900 మంది రెండోడోసు స్వీకరించాల్సి ఉంది’’ అని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
గత అనుభవమే పునరావృతమవుతుందా?
గత ఏడాది కొవిడ్ తొలిదశ (covid first wave) మార్చిలో మొదలైనప్పటికీ, ఉద్ధృతి మే నెల నుంచి సెప్టెంబరు వరకూ కొనసాగింది. ఆ తర్వాత పండుగలు, శుభకార్యాల పేరిట ప్రజలు నిబంధనలు ఉల్లంఘించినా కేసులు పెరగలేదు. ఆర్నెల్ల తర్వాత రెండోదశ ఉద్ధృతి ఒక్కసారిగా మొదలైంది. డెల్టా వేరియంట్ కారణంగా ఈ ఏడాది మే-జూన్ మధ్య కాలంలో ఆసుపత్రులు సరిపోనంతగా కేసులు పెరిగాయి. అప్పట్లో రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారమే ఒక్కరోజులో 10వేలకుపైగా కేసులు, 50కిపైగా మరణాలు సంభవించాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. రాష్ట్రంలో కొన్నాళ్లుగా కేసుల నమోదు 0.5 శాతం లోపే ఉంటోంది. ‘కేసుల్లేవనే ధైర్యంతోనే ప్రజలు గత అనుభవాన్ని మరిచిపోయారు. ఇష్టానుసారం కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రస్తుతం అంతరాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు పెరిగిన నేపథ్యంలో కొత్తరకం వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు అనువైన పరిస్థితులున్నాయి. ఈ తరహా నిర్లక్ష్యం కొనసాగితే, అది మూడో దశ ఉద్ధృతికి దారితీయొచ్చు. ఈ పరిస్థితుల్లో గత అనుభవం పునరావృతమవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు’ అని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ..రెండుడోసులూ స్వీకరిస్తేనే మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 80 శాతం మందికి మొదటి డోసు పూర్తి