బడ్జెట్ సమావేశాల సన్నద్ధతపై అసెంబ్లీ, మండలి ఛైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశమయ్యారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, చీఫ్ విప్, విప్లు ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆదర్శంగా ఉండాలి..
బడ్జెట్ సమావేశాల సన్నద్ధతను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలని సభాపతి పోచారం అన్నారు. సభ సజావుగా సాగేలా సభ్యులు, అధికారుల మధ్య ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సభలో ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటారన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... అధికార యంత్రాంగం సమావేశాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రజా విశ్వాసం కొనసాగించాలి..
సభ ద్వారా తమ సమస్యల పరిష్కారాన్ని కోరుకునే ప్రజల విశ్వాసాన్ని కొనసాగించాలని చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ అధికారులతోనూ సమావేశమైన సభాపతులు బడ్జెట్ సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశాలు సజావుగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు పోలీస్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'