Revanth Reddy on Medigadda Barrage Incident : కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజ స్వరూపం ఇప్పడు బయటపడిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఎలాంటి వరదలు లేకుండానే.. మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. కేసీఆర్.. తన కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం.. కల్వకుంట్ల కుటుంబం ధనదాహానికి బలైపోయిందని మండిపడ్డారు.
Medigadda Barrage Incident : కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని.. తాము మొదటి నుంచే చెబుతున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చెప్పారు, బస్సులు పెట్టి రైతులను, నేతలను తీసుకెళ్లి కాళేశ్వరం చూపించారన్నారు. ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని కేసీఆర్ చెప్పుకున్నారని.. అది కుంగిన తనకు సంబంధంలేదని అంటున్నారన్నారు.
Revanth Reddy fires on KCR : గోదావరి నదికి వచ్చిన వరదల్లో.. పంప్ హౌస్‌లు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలను చూడనివ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఎన్నోసార్లు చెబుతున్నారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని.. ప్రాజెక్టులోని లోపాలేమిటో తాము చెబుతామని, అద్భుతాలేమిటో బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలన్నారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్, ఎన్నికల కమిషన్ మేడిగడ్డపై విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేశారు.
నిపుణులతో కూడిన విజిలెన్స్ కమిషన్ వస్తే.. ప్రాజెక్టు లోపాలు తెలుస్తాయన్నారు. ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసిపోయాయని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోయినందువల్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించడం లేదని విమర్శించారు. ఒకవేళ బీజేపీ పార్టీ బీఆర్‌ఎస్‌తో కలవకపోతే వెంటనే.. దర్యాప్తునకు విజిలెన్స్ కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనని ధ్వజమెత్తారు. నాణ్యత లోపం వల్ల మేడిగడ్డ ప్రమాదం జరిగిందని.. లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్, హరీశ్‌రావు.. కాంగ్రెస్ నేతలతో కలిసి మేడిగడ్డ ప్రమాదం జరిగిన చోటుకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కిషన్ రెడ్డి మేడిగడ్డలో పర్యటించాలని డిమాండ్ చేశారు.
"కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబం ధనదాహానికి బలైపోయింది. ఈ ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. నాణ్యత లోపం వల్లే.. ప్రస్తుతం ఎటువంటి వరదలు రాకుండానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం.. విచారణకు ఆదేశించాలి. కేంద్రమంత్రి అమిత్‌షా, కిషన్‌రెడ్డి పర్యటించాలి. కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్‌ఎస్ నేతలు ప్రమాద ప్రాంతం వద్దకు రావాలి". - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు