Revanthreddy fires on CM KCR about Dharani : తెలంగాణలో ధరణి పోర్టల్ ను ఇన్‌ఫ్రాస్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూదోపిడీ బయటపడుతుందనే ముఖ్యమంత్రి కేసీఆర్... ధరణిపై తాను చేస్తున్న ఆరోపణలకు తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. తన తప్పుల నుంచి పక్కదారి పట్టించేందుకుకే... రైతులను, ప్రజల్ని కేసీఆర్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Revanthreddy Latest comments : 90వేల కోట్ల రూపాయలు బ్యాంకులను ముంచి దివాళా తీసిన... ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రేవంత్ తెలిపారు. తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పిందని పేర్కొన్నారు. తిరిగి పిలిఫ్పీన్స్‌కు చెందిన ఫాల్కాన్ కంపెనీకి అమ్ముకుందని వ్యాఖ్యానించారు. ఐతే కొనుగోలు వ్యవహారానికి నెల రోజుల ముందే ప్రారంభమైన ఫాల్కాన్ కంపెనీ శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిందని తెలిపారు. శ్రీధర్ రాజు సారథ్యం వహిస్తున్న కంపెనీ ఖాతాల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని రేవంత్ డిమాండ్ చేశారు.
'ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య. ధరణి లేకపోతే రైతు బంధు, రైతు బీమా రాదని కేసీఆర్ చెబుతున్నారు. ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ధరణి దోపిడీపై శోధిస్తున్నా కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు. కేసీఆర్ ఆగడాలు మితిమీరిపోయాయి. సీఎం కేసీఆర్‌ను రైతులంతా నిలదీయాలి. రెవెన్యూశాఖ పరిధిలోని భూములన్ని సీసీఎల్‌ఏ కింద ఉంటాయి. ధరణి పోర్టల్ వెనుక ఎన్నో అక్రమాలు ఉన్నాయి. ధరణి నిర్వహణను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థకు అప్పగించారు.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ప్రజల భూముల వివరాలన్నింటినీ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఐఎల్‌ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్‌కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నాయన్న ఆయన... ప్రజల భూముల వివరాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు. తాను మొదటి నుంచి చెబుతున్నానన్న రేవంత్... ధరణి నిర్వహణపై ఐఎల్‌ఎఫ్ సంస్థతో రూ.150కోట్లకు ఒప్పందం చేసుకున్నారన్నారు. ఐఎల్‌ఎఫ్ సంస్థకు చెందిన 99శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసిందన్నారు. 70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్‌ఎఫ్ సంస్థకు విక్రయించారని రేవంత్ విమర్శించారు. రూ.150 కోట్ల టెండర్ దక్కించుకున్న సంస్థ వాటాను ఫిలిప్పీన్ సంస్థ రూ.1,270 కోట్లకు కొనుగోలు చేసిందని వ్యాఖ్యానించారు.
'ఐఎల్‌ఎఫ్ సంస్థ ఒడిశాలోనూ ఈ- ధరణి పోర్టల్ నిర్వహించింది. ఒడిశాలో ఐఎల్‌ఎఫ్ సంస్థ పనితీరు దారుణంగా ఉందని కాగ్ చెప్పింది. కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్టించినట్టు చెప్పారు. తన దోపీడీని కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. ధరణిలో చేసే లావాదేవీలన్ని శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఇక్కడే అసలు మతలబు ఉంది. రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదు. మక్తల్‌కు చెందిన ఆంజనేయులు గౌడ్ ఒక ఉదాహరణ. ఆన్‌లైన్‌లో మాత్రం డబ్బులు రిఫండ్ కావడంలేదు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి? అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా? ధరణి దోపీడీని మేం బయట పెడితే.. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉంది : ధరణి అనేది కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు... అది కేసీఆర్ దోపిడీకి గేట్ వే అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లోపాలు లేకుంటే కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దోషిగా నిలబడిందని ప్రశ్నించారు. ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉందన్న రేవంత్... తెలంగాణ భూమిలన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. శ్రీధర్ రాజు ఏ యువరాజుకు దగ్గరి వాడో తేలాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలన్నారు. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్‌పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్ర పెద్దలే చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :