Revanth Reddy's letter to Chief Minister KCR: రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అకాల వర్షం సృష్టించిన బీభత్సం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని అన్నారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడి వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తుంటే దీనంగా రోదిస్తూ భరించాల్సిన దుస్థితి రైతులకు దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లాలో 1516 మంది కర్షకులు 3193 ఎకరాల్లో కోటి రూపాయలకు పైగా విలువైన పంటను నష్టపోయారు. అరటి, క్యాబేజీ, ఉల్లి, వంగ, టమాటా, మామిడి, మిర్చి, పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 62 గ్రామాల్లో 2633 ఎకరాల్లో పుచ్చ, మొక్కజొన్న, మామిడి, ఉల్లి, టమాటా, జొన్న, తదితర పంటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షాలకు రంగారెడ్డి, సంగారెడ్డి, భదాద్రి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, ములుగు జిల్లాలో 100 కోట్ల రూపాయాలకుపైగా పంట నష్టం జరిగిందన్నారు.
భూపాలపల్లి జిల్లాలో 913, ములుగు 1921, ఉమ్మడి నల్గొండ 3130 ఎకరాల్లో అకాల వర్షానికి పంట నష్టం జరిగింది. ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. రంగారెడ్డిలో 1923 ఎకరాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 19 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగింది. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి, పంట నష్టం అంచనా వేయించి, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకునేవారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియ ఎన్నడూ చేపట్టలేదు. ఇది చాలదన్నట్టు పంటల బీమా పథకాలను సైతం అమలుచేయడం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం రాష్ట్రంలో అటకెక్కించారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో పథకానికి మంగళంపాడారని లేఖలో విమర్శించారు.
రేవంత్రెడ్డి లేఖలో పేర్కొన్న డిమాండ్లు..
• తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలి.
• అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.
• తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.
• పంటల బీమా అమలు కాకపోవడానికి మీ నిర్లక్ష్యమే కారణం కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
ఇవీ చదవండి: