Congress Awareness Conference : ఈ ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ బోయినిపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ముందుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించగా.. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటతో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేతలు కోదండరెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవితో పాటు నియోజకవర్గాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
Revanth Reddy in Congress Awareness Conference : భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ ప్రణాళికపై ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. విభజించి, పాలించి విధానంతో ముందుకెళ్తున్న భాజపా పరిపాలనకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని రేవంత్‌రెడ్డి, భట్టి తెలిపారు. రాహుల్‌గాంధీ సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసి పార్టీ పటిష్టం చేసేందుకే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
పీసీసీ వ్యతిరేక నేతలు హాజరు: ఈ శిక్షణా తరగతులకు పార్టీ పీఎసీ, పీఈసీ, అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని విభాగాల ఛైర్మన్‌లు హాజరయ్యారు. హాత్‌సే హాత్ జోడో అభియాన్‌తో పాటు ధరణి సమస్యలపై పోరాటం, ఎన్నికల నిబంధనలు, బీమా, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై ఈ సందర్భంగా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ శిక్షణా తరగతులకు సీనియర్లు హాజరవుతారా అనేది తొలి నుంచి ఉత్కంఠగా మారింది. అసంతృప్త నేతల్లో ఉన్న సీఎల్‌పీ నేత భట్టి, కోదండరెడ్డి శిక్షణా తరగతులకు హాజరుకాగా.. మిగతా వారు వివిధ కారణాలతో రాలేకపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
"ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ పదవి స్వీకరించలేదు.దేశానికి మంచి నాయకత్వాన్ని అందించారు.ప్రతి గడపను తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం. అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. 2003 నాటి విపత్కర పరిస్థితులే ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. కలిసికట్టుగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
"స్వాతంత్య్రం వచ్చిన 6 నెలలకే మహాత్మా గాంధీని కాల్చిచంపారు. గాంధీని చంపిన రోజే భాజపా దేశంలో విషబీజాలు నాటింది. మళ్లీ నేడు వికృతరూపం తీసుకువచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంది. దేశాన్ని తిరిగి కాపాడే బాధ్యతను రాహుల్‌గాంధీ తీసుకున్నారు. రాహుల్‌గాంధీ ఆశయాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది."- భట్టి విక్రమార్క,సీఎల్‌పీ నేత
ఇవీ చదవండి: