Revanth Padayatra Starts Tomorrow in Medaram: రాష్ట్రంలో ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం ములుగు జిల్లా మేడారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఉదయం 8 గంటలకు రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి.. వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం అనంతరం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని రాత్రికి రేవంత్‌రెడ్డి అక్కడే బస చేస్తారు. ఇదిలా ఉండగా ఆయన పాదయాత్ర నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండనున్న రేవంత్‌రెడ్డి: ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండనున్న రేవంత్‌రెడ్డి.. అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికైతే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేందుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్రలు మొదలు అవుతాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఛార్జిషీట్ రూపంలో: రేపటి యాత్రలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొంటారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఠాక్రే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేడారంలో రేపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్థానిక ముఖ్య నాయకులు కలిసి పాదయాత్రలో పాల్గొంటారని వివరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన ప్రధాన ప్రసంగాలను.. బీజేపీ గడిచిన 8 సంవత్సరాల్లో దేశంలో చేసిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఛార్జిషీట్ రూపంలో జనంలోకి తీసుకెళ్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్పై కాంగ్రెస్ మూడో ఛార్జిషీట్ విడుదల: మరోవైపు బీఆర్ఎస్పై కాంగ్రెస్ మూడో ఛార్జిషీట్ విడుదల చేసింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డితో కలిసి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి.. వ్యవసాయశాఖపై చార్జీషీట్‌ను విడుదల చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు. కోటి ఎకరాల మాగాణి అనే కేసీఆర్ మాటలు ఓ బూటకమని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి: అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో సమాధానం చెప్పి తీరాలి: కేసీఆర్