Revanth Reddy Fires on CM KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా దశాబ్ది దగానేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీనైనా పూర్తిగా అమలు చేశారా..? అంటూ ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఇచ్చినవి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తమకు ఉందని వెల్లడించారు. ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి తమ ఉద్యమాన్ని ఆపలేరని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు.
'తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఉత్సవాలు కేవలం తన కుటుంబం కోసమే జరుపుతున్నట్టు ఉంది. తప్పును నిలదీస్తే తప్పుడు అరెస్టులు చేస్తారా..? రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. ఇవి దశాబ్ది ఉత్సవాలు కావు.. దశాబ్ది దగా' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
- Revanth Reddy To Meet Ponguleti Today : నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి భేటీ
- Congress Searches For Strong Candidates : జన,ధన బలం ఉన్న అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వేట
Revanth Reddy On Congress Arrests : ప్రజల హక్కులను కాలరాసే విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి నిరసనలు వ్యక్తం చేసే హక్కు ఉందని అయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Revanth reddy On Telangana Decade Program : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దశాబ్ది దగా కార్యక్రమం నిర్వహిస్తోంది. పోలీసులు పలు చోట్ల కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో షబ్బీర్ అలీని గృహనిర్బంధించారు. అలాగే విజయా రెడ్డిని, ఎల్బీనగర్లో మల్రెడ్డి రంగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లో దశాబ్ది దగా కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు సీఎం ఫ్లెక్సీ దగ్ధం చేస్తుంటే పాలీసులు అడ్డుకున్నారు. చౌటుప్పల్‌లో పాల్వాయి స్రవంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో రహదారిపై నిరసన నిర్వహించారు.
ఇవీ చదవండి: