Revanth Reddy speech at station Ghanpur: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన "హాథ్ సే హాథ్ జోడో యాత్ర" ఇవాళ జనగామ జిల్లాలో కొనసాగింది. ఉదయం జాఫర్‌గఢ్ మండలం కూనూర్ నుంచి మొదలైన యాత్ర సాయంత్రం స్టేషన్ ఘనపూర్‌కు చేరుకుంది. అక్కడ మాట్లాడిన రేవంత్‌రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సంపదను సీఎం కేసీఆర్ పదిశాతం పెట్టుబడుదారులకు, దొరలకు పంచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఉద్యమకారుడంటే సర్వం కోల్పోయినా వారని గుర్తుచేసిన రేవంత్.. కేసీఆర్ మాత్రం వందలాది ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకొని చక్కగా అందులో కాలం గడుపుతున్నారని విమర్శించారు. దేశ నిర్మాణంలో యువతే కీలకమని వ్యాఖ్యానించిన రేవంత్.. "వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ప్రగతి భవన్ తాళాలు పగులకొట్టి దానికి డా.బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చుతామని" ప్రకటించారు.
ధరణి పోర్టల్‌తో లక్షలాది పేదల భుములు దొరల చేతికి వెళ్లిపోతున్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దోపిడీదారులు వద్ద ఉన్న రూ.4లక్షల కోట్లతో అద్భుతాలు సృష్టిస్తామని తెలిపారు. అంతకు ముందు పాదయాత్రలో భాగంగా రైతులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప్పుగల్‌లో బైరి యాకమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమె సమస్యలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. "డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ ఇంత వరకు ఇవ్వలేదని.. పెంకుటింట్లోనే జీవనం సాగిస్తున్నామని" తన కుటుంబ పరిస్థితిని వివరించింది.
రేవంత్ వారికి ధైర్యం చెబుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆటో డ్రైవర్లు ,గీత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగించారు.
"దళితబంధు పేరుతో ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని ఎన్నికల్లో ఓడించారు. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన తప్పా"- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి:
రాష్ట్రానికి గులాబీ చీడ పట్టుకుంది: రేవంత్ రెడ్డి
ప్రభుత్వం అప్రమత్తంగా లేకుంటే పెను విపత్తు: రేవంత్ రెడ్డి
ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్.. శివసేన పేరు, ఎన్నికల గుర్తు ఏక్నాథ్ శిందేకే సొంతం
'బీబీసీ లెక్కల్లో తేడాలు.. కీలక ఆధారాలు లభ్యం'.. ఐటీ శాఖ ప్రకటన