Revanth Reddy Fires on BRS Manifesto : బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ పార్టీవి ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఏం చేసిందో, చివరకు ఏమైందో ప్రజలు చూశారన్నారు. డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్ఎస్ది అంటూ దుయ్యబట్టారు. అలా ఎన్నికలు గెలవాలని తాము ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రేపటి ఎన్నికల్లో సిద్ధాంతాలు ప్రచారం చేసి ఓట్లు అడుగుదామని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు ప్రచారం చేసే తాము ఓట్లు అడుగుతామని.. మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రజలను మరోసారి మోసం చేయాలనేది కేసీఆర్ యోచన అని ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారన్న రేవంత్.. బీఆర్ఎస్ నేతలు నిజంగా ఉద్యమకారులైతే అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామన్న తమ సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.
Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారు. మాపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌కు నేను సూటిగా సవాల్ విసిరా. చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని ఛాలెంజ్ చేశా. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించా. కేసీఆర్ రాకపోగా.. అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అడ్డుకున్నారు. మా సవాల్ స్వీకరించకపోవడంతో.. కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చింది. - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని నమ్మితే కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు. కేసీఆర్ చెప్పిన నిధులు, నియామకాలు ఆయన ఇంటికే వెళ్తున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడ పైసలు దొరికినా.. కాంగ్రెస్‌వే అంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అమరవీరుల స్థూపంపై ప్రమాణం చేద్దామని రమ్మంటే కేసీఆర్ రాలేదని.. పైగా అక్కడికి వెళ్లిన తనను ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు అడ్డుకున్నారని దుయ్యబట్టారు.
Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర
మేం ఇచ్చిన హామీల్లో అన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు. మరి మేం 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం. కేసీఆర్ ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదు. ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుంది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. - రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌లోకి రావాలని ప్రతాప్‌రెడ్డికి ఆహ్వానం..: అంతకుముందు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు చెవులపల్లి ప్రతాప్‌రెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రతాప్‌రెడ్డిని కోరారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రతాప్‌రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. కార్యకర్తలను, అభిమానులను కలిసిన అనంతరం తన కార్యాచరణ వెల్లడిస్తానని ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు.