Corona Effect : కరోనా కారణంగా జైళ్లలో ఖైదీల ములాఖత్‌లు నిలిచిపోనున్నాయి. ఈనెల 21 నుంచి జైళ్లలో ములాఖత్‌లు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఖైదీలను కలిసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు జైళ్లకు వస్తుంటారు. నిబంధనల మేరకు ఖైదీలను కలిసేందుకు జైలు అధికారులు అనుమతిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జైళ్లలో ఉన్న ఖైదీలతో ఇతరులను కలవనీయొద్దని నిర్ణయించారు. కరోనా మొదటి దశ సందర్భంగా 2020 మార్చి నెలలో ఖైదీల ములాఖత్‌లను అధికారులు నిలిపివేశారు. గతేడాది సెప్టెంబరులో తిరిగి ప్రారంభించారు. నాలుగు నెలలపాటు కొనసాగినప్పటికీ... మరోసారి అధికారులు ములాఖత్‌లపై నిర్ణయం తీసుకున్నారు. కరోనా మూడోదశ వ్యాప్తి అదుపులోకి వచ్చేంత వరకు ములాఖత్‌లు ఉండవని జైళ్లశాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు... పాస్‌పోర్టు సేవల్లో పరిమితులు విధించారు. ప్రస్తుతం ఉన్న స్లాట్‌లలో 50శాతం మాత్రమే బుక్‌చేసుకుంటామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో కొనసాగే సేవా కేంద్రాల్లోనూ 50శాతం మాత్రమే జారీ చేయనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే కౌంటర్ తెరిచి ఉంటుందని తెలిపారు. జనవరి 31 వరకు ఆ పరిమితులు వర్తిస్తాయని బాలయ్య వివరించారు.
ఇదీ చదవండి: ఏషియన్ థియేటర్ పనితీరును తప్పుపట్టిన వినియోగదారుల ఫోరం.. ఎందుకంటే?