అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల అటవీ ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల దృష్ట్యా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నల్లమల్లలో జరిగిన మూడు ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రవేశంపై ఆంక్షలు విధించారు. నల్లమల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీ శాఖ సూచనలు తప్పకుండా పాటించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
అక్కడ వంటలు చేయడం నిషిద్ధం..
అటవీలో నిర్దేశించిన ప్రాంతాలు, రహదార్లపైనే ప్రయాణించాలని సూచించారు. అటవీ మార్గాల్లో కాలి బాటల్లో ప్రయాణంపై నిషేధం విధించారు. సేద తీరేందుకు ప్రత్యేకంగా విరామ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అక్కడ తాగు నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రహదారి వెంట సేదతీరే వారు విరామ ప్రాంతాలకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అటవీలో నిప్పు రాజేయటం, వంటలపై నిషేధం విధించారు. అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలతో పాటు రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి : 'పీసీసీ మర్పు అవసరం లేదు.. తప్పనిసరైతే నాకే ఇవ్వాలి'