సింగరేణిలో చేపట్టిన మరో 215 మెగావాట్ల ప్లాంట్లు ఈ ఏడాది పూర్తవుతాయని సీఎండీ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మికులకు దశలవారీగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.
కరీంనగర్ మానేరు జలాశయం మీద మరో 300 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటు నిర్మాణానికి సింగరేణి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని.. అనుమతి లభిస్తే అక్కడ కూడా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో 85 మెగావాట్లు ఇప్పటికే గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. ఒడిశాలోని నైనీ బ్లాకు నుంచి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి సిద్ధమవుతున్నామని.. న్యూపాత్రపాద బొగ్గు బ్లాకులో మరో రెండేళ్లలో బొగ్గు తవ్వకం ప్రారంభిస్తామన్నారు. ఉత్తమ సింగరేణి అధికారులుగా ఎంపికైన రవిశంకర్, బి.రాజేశ్వరరావు, విజేందర్ రెడ్డి, పూర్ణచంద్రశేఖర్, కిశోర్‌ను ఆయన సన్మానించారు.