Data Theft Case Latest Updates: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 66.9 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యం కేసు విచారణను సైబరాబాద్ ప్రత్యేక విచారణ బృందం (సిట్) పోలీసులు వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలతో పాటు ఎనిమిది మెట్రో నగరాలకు చెందిన పౌరుల డేటాను.. ఈకేసులో ప్రధాన నిందితుడు వినయ్ భరద్వాజ్ చోరీ చేసినట్లు తేల్చారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఈ చౌర్యం జరిగినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నిందితుడికి అమీర్ సోహైల్‌తో పాటు మదన్ గోపాల్ కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది.
పలువురు విద్యార్థులు, క్యాబ్ డ్రైవర్లు, గుజారాత్ రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తు వేతనాలు పొందుతున్న 4.5 లక్షల మంది, జీఎస్టీ, ఆర్టీఓ, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్ తదితర సంస్థల నుంచి నిందితుడు డేటా చౌర్యం చేసినట్టు పోలీసులు విచారణలో బయటపడింది. డేటా మొత్తాన్ని 104 కేటగిరీల కింద విభజించి విక్రయించినట్టు గుర్తించారు.
SIT Police investigating data theft case: నిందితుడు భరద్వాజ్ డేటాను దాదాపు 21 సంస్థల నుంచి చౌర్యం చేసినట్టు తేల్చిన పోలీసులు ఆయా సంస్థల ప్రతినిధులను విచారణకు హాజరుకావాలని నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఇవాళ యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, పాలసీ బజార్, టెక్ మహీంద్రతో పాటు మరో రెండు సంస్థల ప్రతినిధులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సంస్థల డేటా ఎలా బయటకు వచ్చింది.. ఇంటి దొంగలే డేటాను లీక్ చేశారా.. ఇంత పెద్ద ఎత్తున డేటా చౌర్యం అవుతుంటే సంస్థల దృష్టికి రాలేదా.. తదితర అంశాలపై విచారణకు హాజరైన ప్రతినిధులను పోలీసులు ప్రశ్నించారు.
భర్వదాజ్ను ప్రశ్నిస్తే మరింత సమాచారం: మరో వైపు ఈ కేసులో నిందితుడు భరద్వాజ్‌ను ఒకటి రెండు రోజుల్లో కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసుల భావిస్తున్నారు. నోటీసులు జారీ చేసిన ఇతర సంస్థలు కూడా త్వరలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉండగా.. ఆయా సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడతాయని సిట్ బృందం భావిస్తోంది.
ఇవీ చదవండి:
67కోట్ల మంది డేటా ఒక్కడే చోరీ చేశాడా..! అసలు నిందితులు ఎవరు?
అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదన్నారు: బండి సంజయ్ భార్య