Incredible Husk met KTR in London to set up an industry : తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో.. ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఇన్‌క్రెడిబుల్ హస్క్ సంస్థ ప్రతినిధులు కలిశారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు వారు సుముఖం వ్యక్తం చేశారు. ఇన్‌క్రెడిబుల్ హస్క్ సీఈఓ కీత్ రిడ్జ్‌వే నేతృత్వంలోని బృందం.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్, ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్, పొట్టు ప్యాలెట్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. రాష్ట్రంలో నెలకొల్పబోయే ప్రతిపాదిత తయారీ యూనిట్ సంవత్సరానికి 1000 మిలియన్ టన్నుల వరకు బయో ప్యాలెట్‌లను ఉత్పత్తి చేస్తుందని వారు మంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో పొట్టు, పునర్వినియోగ ప్లాస్టిక్ సేకరించేందుకు సహకార నమూనా కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. తెలంగాణ ప్రభుత్వంతో పరస్పర సహకారానికి ఇన్‌క్రెడిబుల్ హస్క్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో హస్క్ సంస్థ పెట్టబోయే ప్రతిపాదిత వెంచర్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో హస్క్ ప్యాలెట్స్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు విధివిధానాలపై కేటీఆర్‌తో చర్చించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హస్క్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా సీఈఓ సీకా చంద్ర షేకర్ నేతృత్వంలోని బృందంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.
మరో సదస్సుకు ఆహ్వానం..: మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జూన్ 12 నుంచి 15వరకు జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించనున్న ఆసియా-బెర్లిన్ సదస్సు 2023కు రావాలని కోరుతూ.. ఆయనకు నిర్వహకులు ఆహ్వానం పంపారు. కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రసంగించాలని వారు కోరారు.
ఇవీ చదవండి: