మంథని పోలీసు స్టేషన్లో శీలం రంగయ్య మృతిలో పోలీసుల పాత్ర లేదని విచారణ అధికారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైకోర్టుకు నివేదించారు. రంగయ్య కుటుంబసభ్యులు , పోస్టుమార్టం చేసిన డాక్టర్లను విచారించి నివేదిక సమర్పించినట్లు సీపీ తెలిపారు. రంగయ్య గొంతుపై మచ్చ తప్ప ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం కూడా ఓసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తెలిపారు. రంగయ్య పోలీసుల కారణంగా మరణించలేదని తేల్చి చెప్పారు. న్యాయవాది పి.వి.నాగమణి రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు రంగయ్య అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టింది.
కమిషనర్ నివేదికను సవాల్ చేస్తామని.. దాని ప్రతిని ఇప్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. నివేదిక ప్రతిని ఇవ్వొద్దని ఏజీ బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదిక ప్రతిని పరిశీలించడానికి న్యాయవాదిని అనుమతించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించిన హైకోర్టు.. దీన్ని ఫొటో తీయడానికి గానీ, పత్రికలకు సమాచారం చెప్పడం గానీ చేయరాదని న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: శీలం రంగయ్య మృతిపై సీపీ అంజనీకుమార్ విచారణ