Renuka Chowdary: రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలే కాదని.. పసి పిల్లలు కూడా సురక్షితంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్రంలో షీ టీమ్స్ ఎక్కడ ఉన్నాయి. జంట నగరాల్లో షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి. ఆడపిల్లలను బయటకు పంపిచాలంటే భయం వేస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించలేదు." -రేణుకా చౌదరి కేంద్ర మాజీ మంత్రి
రాష్ట్రంలో 418 మంది ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగినట్లు పోలీసు నివేదికలే చెబుతున్నాయని తెలిపారు. ఇందులో చాలామందికి తెరాస నేతలతో సంబంధాలు ఉన్నాయని.. అలాంటప్పుడు బాధితులకు న్యాయం ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో వీడియో బయటపెట్టిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా నేరస్థుడేనని రేణుకాచౌదరి అన్నారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై విచారణ పారదర్శకంగా జరగాలంటే హోంమంత్రి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులు తాళలేక భాజపా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారని రేణుకాచౌదరి ప్రశ్నించారు
ఇదీ చదవండి: వెలుగులోకి మరో దారుణం.. బాలికపై ఇద్దరు యువకుల లైంగికదాడి..
చేతిపై రేపిస్ట్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య.. రెండేళ్లుగా మౌనంగా ఏడుస్తూ...