పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మిస్తున్న అంజనగిరి జలాశయంలో నిర్వాసితులవుతున్న మిగిలిన 117 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఖరారు చేసింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన అంజనగిరి తండా, దుల్యానాయక్ తండా, వడ్డెగుడిసెలు, సున్నపు తండా, బోడబండ తండాకు చెందిన 102 కుటుంబాలకు పరిహారాన్ని ఆమోదించారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రెండు పడకల గదుల ఇంటి కోసం ఐదు లక్షలా నాలుగు వేలతోపాటు ఏడున్నర లక్షల రూపాయల నగదు, 250 చదరపు గజాల స్థలాన్ని పరిహారంగా ఇవ్వనున్నారు. 18 ఏళ్లు దాటిన 15 మంది మేజర్లకు 250 చదరపు గజాల స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు పరిహారంగా ఇవ్వనున్నారు. ఇందుకు 13.54 కోట్ల రూపాయల పరిహారానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అటు ఎల్లంపల్లి జలాశయంలో నీటమునిగిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేటకు చెందిన 488 మిగిలిన కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ఖరారు చేశారు. గతంలో ఇళ్ల స్థలాలు, జీతాలు, ఇతర భత్యాలు తీసుకోని వారికి ఈ పరిహారం ఇచ్చారు. ఇదే మండలంలోని రామ్నూర్ గ్రామానికి చెందిన 53 నిర్వాసిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ఖరారు చేశారు. ఇళ్ల స్థలాల కోసం సరైన భూమి లభించనుందుకు ఈ మేరకు ఆర్థికసాయం ప్రకటించారు. అందుకు అనుగుణంగా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: Engineering Counseling: ఎంసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు