సుమారు రెండు నెలలకుపైగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇది స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావమే చూపింది. వివిధ అవసరాలకు ఆస్తులను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయమూ తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ క్రతువును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఏ విధానం అనుసరించాలనే అంశంపై తర్జనభర్జన జరిగింది.
గతంలో కంప్యూటర్ ఆధారిత రిజిస్ట్రేషన్ (కార్డ్) విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. 1999 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానమే అమల్లో ఉంది. ఇకపై ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మీదట అందుకు అనుగుణంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేసింది. పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఆస్తులు, ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కలిగిన ఆస్తులను దానికి అనుసంధానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలకు తావులేకుండా చూడటంతోపాటు, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్(యాజమాన్య హక్కు బదలాయింపు) పూర్తిచేయడం ఇందులో కీలకాంశం. ‘ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, సర్వే నంబర్లు, సబ్ డివిజన్ నంబర్లు, అంకెలు, అక్షరాలు నమోదులో సమస్యలు వస్తున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం’ అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.