RBI JOBS WITH DEGREE: సాధారణ డిగ్రీతో లభించే మేటి ఉద్యోగాలు కొన్నే ఉంటాయి. అలాంటివే ఆర్‌బీఐ గ్రేడ్ -బి ఆఫీసర్ పోస్టులు. ఈ సంస్థ దాదాపు ఏటా ఈ ఉద్యోగాల నిమిత్తం ప్రకటన విడుదల చేస్తోంది. వీటిలో ఎక్కువ పోస్టులకు సాధారణ డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలూ, ఇంటర్వ్యూతో నియామకాలు చేపడతారు. ఈ పరీక్షను జనరల్ అభ్యర్థులు 6 సార్లే రాసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలినవాళ్లు గరిష్ఠ వయసు అనుసరించి ఎన్ని సార్లైనా పోటీపడవచ్చు.
విద్యార్హతలు
- డీఆర్ (జనరల్) పోస్టులకు: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం) లేదా పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసైతే సరిపోతుంది.
- డీఆర్ (డీఈపీఆర్) పోస్టులకు: కనీసం 55 శాతం మార్కులతో ఎకనామిక్స్, ఫైనాన్స్ సంబంధిత కోర్సుల్లో పీజీ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం మార్కులు.
- డీఆర్ (డీఎస్‌ఐఎం) పోస్టులకు: స్టాటిస్టిక్స్/ మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్/ మ్యాథమేటికల్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్/ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఐటీ ఖరగ్‌పూర్) / అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఐటీ బాంబే) వీటిలో ఏదైనా కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత లేదా 55 శాతం మార్కులతో మ్యాథ్స్‌లో పీజీతోపాటు కనీసం ఏడాది వ్యవధి ఉండే పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తి చేయాలి. లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎంస్టాట్ కోర్సు పాసవ్వాలి. లేదా ఐఎస్‌ఐ కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కోల్‌కతా మూడు సంస్థలూ కలిసి అందిస్తోన్న పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ కోర్సును కనీసం 55 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
- వయసు: జనవరి 1, 2022 నాటికి 21 - 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే జనవరి 2, 1992 కంటే ముందు; జనవరి 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎంఫిల్ పూర్తిచేసినవారికి 32 ఏళ్లు, పీహెచ్‌డీ అభ్యర్థులకు 34 ఏళ్లు గరిష్ఠ వయసు వర్తిస్తుంది. బోధనానుభవం ఉంటే సడలింపు మూడేళ్లు.
డీఆర్ జనరల్ పరీక్షలు ఇలా
ఫేజ్-1: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నపత్రం. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. అభ్యర్థులు తర్వాత దశ (ఫేజ్-2)కు ఎంపిక కావాలంటే ఫేజ్-1లో ప్రతి సెక్షన్ నుంచి కనీస కటాఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది. అలాగే అన్ని సెక్షన్లూ కలుపుకుని కనీస మార్కులు సాధించాలి. ఆయా విభాగాల్లో ఖాళీలకు అనుగుణంగా మెరిట్ ప్రాతిపదికన తర్వాత దశకు ఎంపిక చేస్తారు. ఫేజ్-1 నిర్వహించిన వారం తర్వాత ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు వెల్లడిస్తారు.
ఫేజ్-2: ఈ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మొత్తం 3 పేపర్లు.
పేపర్-1: ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అంశంపై ఉంటుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌లో 50 శాతం చొప్పున ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. వీటిలో ఆబ్జెక్టివ్‌కి అర గంట. డిస్క్రిప్టివ్‌కి 90 నిమిషాలు. ఒక్కో విభాగానికి 50 చొప్పున ప్రశ్నపత్రానికి 100 మార్కులు కేటాయించారు.
పేపర్-2: ఇంగ్లిష్ రైటింగ్ నైపుణ్యాలపై నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానం. ఈ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మార్కులు వంద. 3 ప్రశ్నలు వస్తాయి.
పేపర్-3: జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ అంశాల్లో నిర్వహిస్తారు. సగం ఆబ్జెక్టివ్, మిగిలిన భాగం డిస్క్రిప్టివ్ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఒక్కో విభాగానికీ 50 చొప్పున వంద మార్కులకు ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్ పేపర్ మినహా మిగిలిన ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. అలాగే ఈ విభాగంలోని పేపర్-1, పేపర్-3ల్లో 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో కొన్ని ఒక మార్కు, మరికొన్ని రెండు మార్కులకు ఉంటాయి. ఈ పేపర్లకు సంబంధించి డిస్క్రిప్టివ్ విభాగంలో 6 ప్రశ్నలు వస్తాయి. వీటిలో నాలుగింటికి సమాధానాలు రాస్తే సరిపోతుంది. 15 మార్కుల ప్రశ్నలు 2, 10 మార్కుల ప్రశ్నలు రెండు రాయాలి.
బ్యాంకు పీవో పోస్టులకు సన్నద్ధమవుతున్నవారు వీటికోసం ప్రయత్నించవచ్చు. అయితే ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంటుంది. ఎంపికైనవారు దేశ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాల్లో భాగమవుతారు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో వీరు అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు.
ఇంటర్వ్యూ...
ఫేజ్-2 (పేపర్ 1 + పేపర్ 2 + పేపర్ 3) లో చూపిన ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. ఫేజ్ 2 + ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ద్వారా తుది నియామకాలు చేపడతారు.
గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులకు ఏ విభాగంలో (జనరల్/ డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం) ఎంపికైనప్పటికీ రూ.55,200 మూలవేతనం పొందవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే సుమారు రూ.1,08,400 అందుకోవచ్చు. అత్యున్నత సంస్థల్లో ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారికీ, బ్యాంకుల్లో అనుభవం ఉన్నవారికీ అదనంగా 4 ఇంక్రిమెంట్లు దక్కుతాయి.
ముఖ్య సమాచారం
మొత్తం 294 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ గ్రేడ్- బి జనరల్ విభాగంలో 238, ఆఫీసర్ గ్రేడ్- బి డీఈపీఆర్: 31, ఆఫీసర్ గ్రేడ్‌బి డీఎస్‌ఐఎం: 25 ఉన్నాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 18 సాయంత్రం 6 వరకు.
ఫేజ్ 1 పరీక్ష తేదీ: జనరల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి మే 28న నిర్వహిస్తారు. డీఈపీఆర్, డీఎస్‌ఐఎం పోస్టులకు ఫేజ్-1 పరీక్ష జులై 2న ఉంటుంది.
ఫేజ్ 2 పరీక్ష తేదీ: జనరల్ పోస్టులకు జూన్ 25న ఫేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. డీఈపీఆర్, డీఎస్‌ఐఎం పోస్టులకు ఆగస్టు 6న జరుగుతాయి.
ఫేజ్-1 పరీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్.
ఫేజ్ 2 పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. వెబ్‌సైట్:www.rbi.org.in
సన్నద్ధత ఎలా?
* ఆర్‌బీఐ గ్రేడ్- బి పరీక్షలకు సంబంధించి జనరల్ విభాగం పోస్టుల ఫేజ్-1 ప్రశ్నపత్రం ఇంచుమించు ఐబీపీఎస్ పీవో మాదిరిగానే ఉంటుంది. అయితే ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. అందువల్ల సంబంధిత అంశాలను క్యాట్ స్థాయిలో సన్నద్ధం కావాలి.
* జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఎదుర్కోవడానికి బిజినెస్ పత్రికలు చదవాలి. ఇందులోని వ్యాసాలు ఫేజ్-2లోని డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి.
* ఫైనాన్స్, ఎకానమీ, బ్యాంకింగ్ అంశాలపై పట్టు పెంచుకోవాలి.
* ఫేజ్-2కు సంబంధించి సిలబస్, రిఫరెన్సు మెటీరియల్ వివరాలు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిని అనుసరిస్తే పరీక్షను ఎదుర్కోవడానికి వీలవుతుంది. అలాగే మాదిరి ప్రశ్నపత్రాలనూ ఆర్‌బీఐ పొందుపర్చింది. పరీక్షపై అవగాహనకు అవి ఉపయోగపడతాయి.
ఇవీ చూడండి: