లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే పేదలకు బియ్యం, నగదు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదు పంపిణీ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. 87 లక్షల 59 వేల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి నెల 28న కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పాస్ యంత్రాల్లో వేలిముద్రలు వేయడాన్ని నిలిపివేసింది. కూపన్ల ద్వారా బియ్యం పంపిణీ చెయ్యాలని తాజాగా నిర్ణయించింది. వరుసగా మూడు నెలలపాటు సరుకులు తీసుకోని వారు మాత్రం... వేలిముద్రలను వేయాలని స్పష్టం చేసింది.
సాధారణంగా ఏప్రిల్ ఒకటి నుంచి 15 వరకు మాత్రమే చౌక ధరల దుకాణాలు పనిచేస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కార్డుదారులంతా సరుకులు తీసుకునే వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో రేషన్ కార్డుపై కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కందిపప్పును నాఫెడ్ ద్వారా సరఫరా చేస్తామని తాజాగా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా కందిపప్పు ఎంత అవసరమో వివరాలు ఇవ్వాలని కోరింది. 3 నెలల పంపిణీకి గానూ రాష్ట్రానికి 2 లక్షల 63 వేల క్వింటాళ్ల కందిపప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్‌కు లేఖ రాసింది.
బియ్యం పంపిణీని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రేషన్‌కార్డున్న ప్రతి కుటుంబానికి నెలకు కిలో చొప్పున మూడు నెలలపాటు కంది పప్పు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 15 రోజుల తర్వాత పంపిణీని ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చూడండి: దేశంలో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి