దేశవ్యాప్తంగా కరోనా విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల రాత్రి పూట కర్వ్ఫూ కొనసాగుతోంది. ఇంకొన్ని చోట్ల లాక్డౌన్ పెడుతున్నారు. ప్రయాణాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద లైసెన్స్ కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 70 మంది ఉండే కూలీలు పూర్తిగా రావడం కూడా మానేశారు.
పనికి వస్తున్న 20 మందికి కూడా పని దొరకడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం ముంబయి రైలులో 20 మంది ప్రయాణికులు మాత్రమే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వచ్చిన వారు తమ సామాన్లు వేరే వారికి ఇవ్వాలంటే జంకుతున్నారు. ఎవరికీ కరోనా ఉందో అన్న కోణంలో సామాన్లు ఇవ్వడం లేదు.
ఈ విధంగా తమకు పని లేకుండా నష్టపోతున్నామని కూలీలు అంటున్నారు. ఇంటి నుంచి పనికోసం స్టేషన్కు వచ్చినప్పటికీ... తమ ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని వాపోతున్నారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రవాణా ఛార్జీల కోసం ఇంకా అదనంగా ఖర్చుచేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి : ఏపీలో రికార్డు స్థాయిలో 10,759 కరోనా కేసులు నమోదు