Raghunandan Rao Reacts to Mallareddy Comments: రాష్ట్రంలో మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు తప్పుబట్టారు. చట్టానికి లోబడి పనిచేసే అధికారులు ఎవరిని కొట్టరని అన్నారు. ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ.. ఆస్పత్రికి వెళ్తున్నారని పరోక్షంగా మంత్రి కుమారుడిపై విమర్శలు గుప్పించారు. మల్లారెడ్డి కుమారుడు నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే.. ఐటీకి సమాచారం ఇచ్చారని తెలుస్తోందని పేర్కొన్నారు.
Raghunandan Rao Reacts to Mallareddy Comments on IT Raids : చట్టం ముందు అందరూ సమానమని ఎవరిని నోటీసులు ఇచ్చిన తప్పకుండా పాటించాలని రఘునందన్ రావు కోరారు. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు తనను గెలిపించి టీఆర్ఎస్కు తొలి దెబ్బను కొట్టారని తెలిపారు. ఆంధ్రా పాలకులు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలపై ఇంత వివక్ష లేదని పేర్కొన్నారు. నియోజకవర్గ అభిృద్ధికి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తే స్థానిక ఎమ్మెల్యే ఖర్చు చేసే అవకాశం కల్పించకుండా.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఓ విధానం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మరో విధానమా అని రఘునందన్ రావు నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేసీఅర్ ధర్మబద్ధంగా పాలించాలని పేర్కొన్నారు. ఇకనైనా సీఎం వ్యవహార శైలి మారకపోతే.. దుబ్బాకలో పట్టిన గతే రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని దుయ్యబట్టారు. కేసీఆర్ తక్షణమే దుబ్బాక నియోజకవర్గ అభిృద్ధి నిధులు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే రఘనందన్ రావు డిమాండ్ చేశారు.
"బాధ్యతగల మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన కొడుకును రాత్రంతా అధికారులు కొట్టారని అన్నారు. ఐటీ అధికారులు పేపర్లు తనిఖీలు చేస్తారు కానీ కొట్టడం చేయరని అనుకుంటున్నాను. మంచిగా ఆరోగ్యం ఉన్న వ్యక్తులకు ఈడీ, ఐటీ నోటీసులు రాగానే గుండెనొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్ధం కావడం లేదు. అసలు ఆ కేసులో మల్లారెడ్డి దగ్గర పనిచేసినవారే ఆయనతో విబేధించి వెళ్లినా వారే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అందులో భాగంగానే తనిఖీలు చేపట్టారు. అలా కాకుండా చెత్తబుట్టలో ఫోన్ దాచిపెట్టడం, ఫైల్స్ దాయడం చేస్తున్నారంటే మీరు తప్పు చేశారని అర్ధమవుతోంది. చట్టం ముందు అందరూ సమానమే. నాకు నోటీసులు వచ్చినా నేను వెళ్తాను." - రఘునందన్ రావు, ఎమ్మెల్యే
అసలేెం జరిగిందంటే: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, అతడి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్న సమయంలో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థత గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయణ్ను తన కుటుంబ సభ్యులు వెంటనే సూరారంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి తన ఇంటిలో సోదాలు నిర్వహిస్తోన్న అధికారులను నెట్టేసి ఆస్పత్రికి వెళ్లి కుమారుడిని పరామర్శించారు. ఆయన వెంటనే ఐటీ అధికారులు వెళ్లారు. కుమారుడిని చూసిన అనంతరం రాజకీయ కుట్రతోనే దాడులకు పాల్పడుతున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన పెద్ద కుమారుడిని ఇబ్బందిపెట్టడం వల్లే ఛాతి నొప్పి వచ్చిందని వాపోయారు. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ పోలీసులు తన కుమారుడి ఛాతిపై కొట్టారని మల్లారెడ్డి తెలిపారు. రాత్రంతా హింసిస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రిని కాబట్టే తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: కుమారుడికి అస్వస్థత.. సీఆర్పీఎఫ్ దళాల దాడి వల్లేనని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు
'మేరఠ్ పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తాం'.. హిందూ మహాసభ వాగ్దానం