Radisson Blu Pub: టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డ రాడిసన్ బ్లూ హోటల్ బార్ అండ్ రెస్ట్రారెంట్ లైసెన్స్ రద్దు చేశారు. పబ్‌లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న ఘటనపై అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పబ్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. బంజారాహిల్స్ పబ్ ఘటనపై అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించగా.... నిబంధనలు ఉల్లంఘించినట్లు అబ్కారీ శాఖ నిర్ధరణకు వచ్చింది.
పబ్ లైసెన్స్ రద్దు చేయాలని మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ ఇంఛార్జి డీసీ అజయ్‌రావ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కొకైన్‌తోపాటు ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన: డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్.. ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని గతంలో పబ్ యజమానులతో సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. నిబంధనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.
సంబంధిత కథనాలు..