mlas camp office hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల మాదిరిగానే హైదరాబాద్ జిల్లాలోను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించేందుకు సర్కారు సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన శాసనసభ్యులకు క్యాంపు కార్యాలయాల నిర్మాణంపై నగరానికి చెందిన మంత్రులు, ఉపసభాపతి, శాసనసభ్యులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇతర జిల్లాల మాదిరిగానే..
గౌరవ శాసనసభ్యులకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశంతో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో దాదాపుగా అన్ని చోట్లా పనులు పూర్తయ్యాయని.. చాలా చోట్ల అందుబాటులోకి వచ్చాయని అన్నారు. క్యాంపు కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు మెరుగైన సేవలు పొందుతున్నారని చెప్పారు. అదే తరహాలో రాజధాని హైదరాబాద్ జిల్లాలోని శాసనసభ్యుల కోసం కూడా క్యాంపు కార్యాలయాలు నిర్మించ తలపెట్టినట్లు తెలిపారు.
స్థల సేకరణకు ఆదేశాలు
హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో 500 చదరపు గజాల చొప్పున భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తక్షణమే ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని, గౌరవ శాసనసభ్యులతో చర్చించి ప్రభుత్వానికి తగిన నివేదికలు పంపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: CS on Employee Bifurcation: 'ఉద్యోగుల విభజన పారదర్శకంగా పూర్తిచేయాలి'