Prashanth reddy fires on revanth reddy : అమరజ్యోతి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో నిర్మించిందని.. ఓట్ల రాజకీయాల కోసం కాదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ఆరు అంతస్తుల అమర జ్యోతిని సందర్శించి.. అక్కడ ఏర్పాట్లు చూస్తే నిర్మాణం గొప్పతనం అర్థమవుతుందని మంత్రి సూచించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
అమరుల బలిదానాలు జరిగిందే కాంగ్రెస్ చేసిన జాప్యం, గందరగోళ ప్రకటనల వల్ల అని మంత్రి విమర్శించారు. సోనియాగాంధీ బలి దేవత అని ఆనాడు చెప్పిన రేవంత్.. అమరుల కుటుంబాలతో సోనియా గాంధీ సహపంక్తి భోజనాలు చేస్తుందనడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు. తామే చంపామని పాపప్రాయశ్చిత్తం చేసుకుంటారా అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
అమరుల కుటుంబాల పాదాలు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా.. కాంగ్రెస్ చేసిన పాపం పోదని మంత్రి ఎద్దేవా చేశారు. యాభై ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. భారత స్వాతంత్య్ర అమరవీరులకు స్మారకాన్ని దిల్లీలో ఎందుకు కట్టించలేదని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌ను వ్యక్తిగతంగా తిడితే వార్తల్లో ఉంటాననే ఆరాటంతో రేవంత్ పసలేని ఆరోపణలు చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
బ్లాక్ మెయిలర్తో నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అమరవీరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయన్నారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్న ప్రశాంత్ రెడ్డి.. తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగింది..: తెలంగాణ అమరుల స్మారక నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.80 కోట్ల అగ్రిమెంట్‌ను రూ.179.5 కోట్లకు పెంచారని విమర్మించారు. ఇంత ఖర్చు చేసిన శిలాఫలకంపై అమరవీరుల పేర్లను పెట్టలేనప్పుడు.. రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరును ఎలా రాయించాలని ధ్వజమెత్తారు. అమరుల స్మారక నిర్మాణాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం కాదా? ఇది బరితెగింపు కాదా అని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది.. మలి దశలో 1200 మంది అమరులయ్యారని 2014 జూన్ 14 అసెంబ్లీ సమావేశంలో కేసీఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కానీ నేడు మలి దశలో 1200 మంది ఎక్కడ అమరులయ్యారని ఒక మంత్రి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయమని ఆరోపించారు.
ఇవీ చదవండి: