Quick service restaurants : ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లు అయిన కేఎఫ్‌సీ, మెక్ డొనాల్డ్స్, పిజ్జాహట్, డొమినోస్‌కి చెందిన అవుట్‌లెట్లు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కన్పిస్తుంటాయి. ప్రధాన రహదారిలో కింది అంతస్తులో తక్కువ విస్తీర్ణంలో వీటి ఏర్పాటును గమనించవచ్చు. కొద్ది మంది మాత్రమే కూర్చుని తినే ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కువ మంది పార్శిల్ తీసుకెళ్తుంటారు. కొవిడ్ సమయంలోనూ వీటికి గిరాకీ బాగానే ఉంది. ఇప్పుడు ఇదే పంథాను హైదరాబాద్‌లోని సంప్రదాయ రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లు అనుసరిస్తున్నాయి. విశాలమైన రెస్టారెంట్ల స్థానంలో 800 నుంచి వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోనే క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను ఆరంభిస్తున్నాయి. కొన్నింటిలో అక్కడే వండి వడ్డిస్తుండగా.. మరికొన్ని సెంట్రల్ కిచెన్ నుంచి ఆహారశాల వరకు రప్పిస్తున్నాయి.
తక్కువ విస్తీర్ణంలో..
ఆహారప్రియుల అభిరుచులను పరిశీలించిన అనంతరం ఇటీవలనే హైదరాబాద్ హౌస్ ఈ తరహా క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌ను బేగంపేటలో పునఃప్రారంభించింది. ఇక్కడ కబాబ్స్, బిర్యానీ, పాయాలతో పాటు ప్రత్యేక వంటకాలైన లుక్మీ, మటన్ మరాగ్, లెగ్ రోస్ట్ నోరూరిస్తున్నాయి. హలీం ఇక్కడ రోజూ ఆరగించొచ్చు. కూరలను తూకం కొద్దీ ఎంత కావాలంటే అంత వడ్డించడం ప్రత్యేకత అని యాజమానుల్లో ఒకరైన ఆదిత్యరావు అన్నారు. ఇష్టం లేకపోయినా ఇద్దరు కలిసి ఒకే కూరను తినాల్సిన అవసరం లేదని, చెరో 50 గ్రాములు ఆర్డర్ ఇచ్చుకోవచ్చన్నారు.
1999లోనే తొలి ‘టేక్ అవే’..
మా తాత మొదట్లో కేటరింగ్ చేసేవారు. 1975 నుంచి ఈ రంగంలో ఉన్నారు. తర్వాత మా నాన్న కొనసాగించారు. అప్పట్లో వీఎస్‌టీ, అల్విన్, సీఎంసీ, సత్యం వంటి కంపెనీల్లో క్యాంటీన్లు నిర్వహించేవారు. క్యాటరింగ్ సేవలు అందించేవారు. మొదట్లో వేడుకల్లో మాత్రమే విందు భోజనం ఉండేది. ఇళ్లలో బిర్యానీ వంటి వంటకాలు తక్కువ పరిమాణంలో చేసుకోవడం సాధ్యం అయ్యేది కాదు. కానీ చాలామంది కావాలని అడిగేవారు. దీంతో 1999లో మొదటగా మా నాన్న హైదరాబాద్ హౌస్‌ని మాసాబ్‌ట్యాంక్‌లో ఏర్పాటు చేశారు. నగరంలోనే తొలి టేక్ అవే అది. తర్వాత ప్రజల ఆదరణతో వేర్వేరు ప్రాంతాలు, నగరాలకు విస్తరించింది. డెక్కన్ వంటకాలు ప్రసిద్ధి కావడంతో రెస్టారెంట్ వ్యాపారం విదేశాల వరకు విస్తరించినా.. ఆర్థిక సమస్యలతో 2014లో మూతపడింది. మూడో తరంగా నేను ఈ పరంపరను కొనసాగిస్తున్నాను. హోటల్ మేనేజ్‌మెంట్‌లో నా సహాధ్యాయుడిగా ఉన్న ఆదిత్యరావు లింగాలతో కలిసి పునఃప్రారంభించాను. - మీర్ జుబేర్ అహ్మద్, హైదరాబాద్ హౌస్
ఇదీ చూడండి: Alternative Crops : ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతుల ఆలోచన