HCU on psoriasis:సోరియాసిస్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే పలు రకాల ఔషధాలు అందుబాటులో ఉండగా.. అవి మనిషి రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాధికి కారణమైన నిర్దేశిత కణాలపై నేరుగా ప్రభావం చూపే ఔషధాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు విజయం సాధించారు. సోరియాసిస్ వ్యాధి నిరోధానికి సరికొత్త పద్ధతిని హెచ్‌సీయూ ఆచార్యులు తీసుకువచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా నేరుగా వ్యాధికి కారణమైన జన్యువుపై పనిచేసే విధానాన్ని కనిపెట్టారు. వర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం ఆచార్యులు పి. రెడ్డన్న నేతృత్వం వహించగా.. ఆచార్యులు నూరుద్దీన్ ఖాన్, కుమార్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు హర్షవర్దన్ భక్తార్, శారదా శుక్లా, మనోజిత్ పాల్ సహకారం అందించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ నిధులు అందించింది.
సాధారణంగా నెలకోసారి మనిషి శరీరంపై కణాల విభజన జరిగి కొత్తవి పుట్టుకొస్తాయి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో నాలుగైదు రోజులకే చర్మంపై కణ విభజన అధికంగా జరిగి సోరియాసిస్‌కు దారి తీస్తుంది. ఇందుకు “12 ఆర్-లైపొక్సిజినేజ్ " అనే ఏంజైమ్ లక్షణాలున్న జన్యువు... కణాల అధిక విభజనకు కారణమవుతున్నట్లు తేల్చారు. ఈ ప్రక్రియలో అరాకిడోనిక్ ఆమ్లం అధికంగా చర్మంపై పేరుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సదరు జన్యువు పిండ దశలో క్రియాశీలంగా ఉండి జీవుల్లో చర్మం ఏర్పాటుకు కారణమవుతుంది. ఆ తర్వాత క్రియారహితంగా మారతుంది. కానీ, సోరియాసిస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ జన్యువు మళ్లీ క్రియాశీలంగా మారుతున్నట్లు హెచ్‌సీయూ ఆచార్యుల పరిశోధనలో తేలింది.
డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ భాగస్వామ్యంతో “ 12 ఆర్-లైపోక్సిజినేజ్ "చర్యను నిరోధించే ప్రత్యేక కణాన్ని తయారు చేశారు. ఇది కణ విభజనను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించింది. దీన్ని ఎలుకలపై ప్రయోగించినప్పుడు సోరియాసిస్ లక్షణాలు క్రమంగా తగ్గిపోవడం... వ్యాధి ప్రబలిన చోట వెంట్రుకలు సైతం తిరిగి రావడం గుర్తించారు.
ఇవీ చదవండి:
Horticulture in TS: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు.. బిందుసేద్యంతో సాంకేతిక పరిజ్ఞానం