భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రోకు.. జవసత్వాలు చేకూర్చిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్-పీఎస్‌ఎల్‌వీ.. మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తూ.. 52వ ప్రయోగాన్ని సఫలీకృతం చేసింది. ఈ మేరకు పీఎస్‌ఎల్‌వీ-సీ50 వాహననౌక నిప్పులు కక్కుకుంటూ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకొని వెళ్లింది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం... గురువారం మధ్యాహ్నం 3.41 నిమిషాలకు.. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇది సీఎంఎస్-01 ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. భారత ప్రధాన భూ భాగంతోపాటు అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్‌లో సీ-బ్యాండ్ సేవల విస్తరణకు ఇది దోహదపడనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ50 శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన 77వ ప్రయోగం కాగా.. ఎక్స్ఎల్ కాన్ఫిగరేషన్‌లో 22వ ప్రయోగం. ఈ ఏడాది తొలిసారి నవంబర్ 7న భూపరిశీలన ఉపగ్రహం- ఈఓఎస్-01ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. తాజాగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
కేసీఆర్ ప్రశంసలు..
పీఎస్‌ఎల్‌వీ- సీ50 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్ డివైజ్‌లు ఇవే...