దేశవ్యాప్తంగా ఇవాళ, రేపు రెండు రోజులపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవీ పని చేయవని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు పదిలక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు యుఎఫ్‌బీయూ ప్రతినిధులు శ్రీరాం, రాంబాబు, నగేష్‌లు తెలిపారు. అదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలల్లోని 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 70వేల మందికిపైగా ఉద్యోగులు, అధికారులు సమ్మెలో భాగమవుతుండగా ఇరు రాష్ట్రాల్లోని పదివేలకుపైగా బ్యాంకు శాఖలు మూతపడతాయని వివరించారు. యుఎఫ్‌బీయూ పరిధిలోని తొమ్మిది యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేటు రంగ బ్యాంకులు మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మెలో భాగస్వామ్యం అవుతాయని పేర్కొన్నారు.
ఏఐబీఈఏ, ఏఐబీవోసీ యూనియన్లకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఇవాళ కోటిలోని సెంట్రల్ బ్యాంకు ఆవరణలో సమావేశమై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేయనున్నారు. రేపు సైఫాబాద్‌లోని యూనియన్ బ్యాంకు ఆవరణలో సమావేశమై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేఖంగా నిరసన ప్రదర్శన చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ ఎస్.రాంబాబు తెలిపారు. అదే విధంగా మిగిలిన ఏడు యూనియన్లకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఇవాళ కోటి భారతీయ స్టేట్ బ్యాంకు ఆవరణంలో సమావేశమై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తారు. ఈ నిరసన కార్యక్రమాల్లో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులతోపాటు పలువురు విశ్లేషకులు కూడా పాల్గొంటారని ఎస్.రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి: ఏవోబీలో రెండు గంటలపాటు ఎదురుకాల్పులు..