Proposals to Amend Fire Department Act: రాష్ట్రంలో ఒక పక్క అగ్నిప్రమాదాల తీవ్రత, వాటి తాలూకు మరణాలు పెరిగిపోతున్నా ఉల్లంఘనలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇందుకు ప్రధాన కారణం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు లేకపోవడమే. యజమానుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, అమాయకులు మరణించారని నిరూపణ అయినప్పటికీ బాధ్యుల నుంచి జరిమానా మాత్రమే వసూలు చేస్తున్నారు. దాంతో ఉల్లంఘనలకు పాల్పడినా ఏమీ కాదులే అనే భరోసా ఏర్పడుతోంది.
సికింద్రాబాద్ దక్కన్‌మాల్ ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక చట్టానికి పదును పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. తీవ్రతను బట్టి కఠిన శిక్షలు విధించేలా సవరణలను ప్రతిపాదించనున్నారు. వాణిజ్య సముదాయాలు, ఎత్తైన భవనాలు, బహుళ వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ల వంటి వాటిని కచ్చితంగా అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారమే నిర్మించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించేలా అత్యవసర మెట్లు, భవనం లోపల అగ్నిప్రమాదాన్ని గుర్తించే సెన్సర్లు, వాటంతట అవే పని చేసే స్ప్రింక్లర్లు, భవనం చుట్టూ ఫైరింజన్ తిరగగలిగే సదుపాయం, ప్రమాదాన్ని ఆర్పడానికి అవసరమైన నీటి కోసం భూగర్భంలో, భవనంపై సంపులు, వీటి నుంచి నీటిని తోడేందుకు డీజిల్‌తో పని చేసే మోటార్ వంటివి కచ్చితంగా ఉండాలి. కానీ చాలా మంది ఈ నిబంధనలను పాటించడం లేదు. అనుమతులు తెచ్చుకునేందుకు మొదట్లో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. తర్వాత నిర్వహణ గురించి పట్టించుకోవడం లేదు. దాంతో ప్రమాదం జరిగినప్పుడు అవి పని చేయడం లేదు. చిన్నగా మొదలైన నిప్పు పెను ప్రమాదంగా మారడానికి ఇదే కారణం.
ఇటీవల సికింద్రాబాద్ దక్కన్ మాల్‌లో జరిగిన ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. గత సెప్టెంబరులో సికింద్రాబాద్‌లో జరిగిన రూబీ లాడ్జి ప్రమాదంలో 8 మంది, బోయిగూడ ప్రమాదంలో 11 మంది మరణించారు. వీటిలో ఎక్కడా అగ్నిమాపక నిబంధనలు పాటించలేదు. ఈ ప్రమాదాలకు బాధ్యులైన యాజమాన్యాలపై అగ్నిమాపకశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 695 కేసులు నమోదు చేశారు. వీటిలో సుమారు 90 కేసులలో మాత్రమే జరిమానాల రూపంలో శిక్షలు పడ్డాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఉల్లంఘనలు నిరూపితమైనా నామమాత్రపు జరిమానాలతోనే సరిపెడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ శిక్షల తీవ్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక చట్టాలను సవరించాలని గతంలోనూ ప్రయత్నాలు జరిగినప్పటికీ అవేవీ ముందుకు కదలలేదు. కానీ ఇప్పుడు మాత్రం అధికారులు దీనిపై దృష్టి సారించారు. అవసరమైన మేరకు కఠిన చట్టాలను తేవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: