ప్రియా పాటిల్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొవిడ్ కారణంగా తరగతులన్నీ ఆన్‌లైనే. దీంతో చాలా ఖాళీ ఉండేది. ఆ సమయాన్ని సమాజ సేవకు ఉపయోగిద్దామనుకుంది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం అంబులెన్స్ డ్రైవింగ్. ఈమెది మహారాష్ట్రలోని కొల్హాపూర్. తండ్రి షిరోలీలోని ఇండస్ట్రియల్ యూనిట్‌లో, తల్లి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె తన నిర్ణయాన్ని వాళ్లతో పంచుకున్నపుడు వాళ్లూ సమ్మతించారు. ఆమెకు డ్రైవింగ్ వచ్చు. తను నివసించే జాదవ్‌వాడికి దగ్గర్లో ప్రభుత్వాసుపత్రి ఉంది. అక్కడ అంబులెన్స్ నడపడానికి చేరింది. కొవిడ్ కారణంగా మృతిచెందిన వారిని శ్మశానవాటికలకు తరలిస్తోంది.
‘మొదటిసారి పీపీఈ కిట్ ధరించి అంబులెన్స్ డ్రైవర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొంత భయపడ్డా. తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించడం నాకు ప్రోత్సాహాన్నిచ్చింది. చేరి కొద్దిరోజులే అయినా వంద మంది మందిని శ్మశానవాటికలకు తరలించాను. వారిని జాగ్రత్తగా తుది మజిలీకి పంపడం సంతృప్తినిస్తోంది’
-ప్రియ.
రోజూ ఉదయం 9 గం. నుంచి రాత్రి 9 గం. వరకు ప్రియ ఈ సేవలందిస్తోంది. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి చితిని పేర్చడంలోనూ సాయమందిస్తోంది. దేశంలో శ్మశానవాటికల్లో అమ్మాయిలకు అనుమతి తక్కువ. పైగా కొవిడ్ ఉందని కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్న సమయంలో ఈమె ధైర్యంగా ముందుకొచ్చి సేవలందిస్తోంది.
ఇదీ చూడండి: Vaccine: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు