పండుగలు వచ్చాయంటే చాలు.. ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు దోపిడీకి తెరలేపుతున్నారు. సాధారణ ఛార్జీలతో పోల్చితే నాలుగైదు రెట్లు టికెట్ ధరలు పెంచేస్తుంటారు. ప్రయాణికుల అవసరాలను బట్టి ధరలు నిర్ణయిస్తారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలపైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమూ ఇందుకు కారణమని.. ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల దసరా టికెట్ల బాదుడు మొదలుపెట్టారు. దూర ప్రాంతాలకు నడిచే బస్సు ఛార్జీల ధరలు భారీగా పెంచారు. టికెట్ ధరను 100 నుంచి 125 శాతం పెంచారు. పండగ దగ్గర పడే కొద్దీ అవి మరింత పెరుగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
భారీగా బాదుడు..
హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖకు వెళ్లే ప్రైవేటు బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. విజయవాడకు ఏసీ స్లీపర్ బస్సుల్లో వెళ్లాలంటే రూ.1,100, వాల్వో బస్సులో అయితే రూ.2,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 500 నుంచి రూ. 600 వరకు మాత్రమే ఉంటుంది. విశాఖపట్నం మార్గంలో బస్సు స్థాయిని బట్టి రూ.1,100 నుంచి రూ.3,000 వరకు ఉంది. రాజమండ్రి మార్గంలో టికెట్ ధర రూ.900 నుంచి రూ. 2,000 వరకు పలుకుతోంది. అసలే కరోనాతో ఆర్థికంగా అవస్థలు పడుతున్నామని.. ఇప్పుడు ఛార్జీలు పెంచితే ఎలాగంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీజిల్ ఛార్జీలు పెరగడం వల్లనే..
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మాత్రం తాము సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నామంటున్నారు. డీజిల్ ధరల పెరుగుదల మేరకే తాము కొద్దిగా ధరలు పెంచామని చెబుతున్నారు. అసలు ట్రావెల్స్‌లో ప్రయాణించేవాళ్లే తగ్గారని.. ఆ పరిస్థితుల్లో ధరలు ఎలా పెంచుతామని చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ప్రయాణికుల సంఖ్య కాస్త పెరిగినా.. ఎక్కువ శాతం సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు.
ఆర్టీసీ సైతం..
ఆర్టీసీ సైతం దసరా సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సు సర్వీసులపై ఛార్జీలు పెంచింది. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న సర్వీసుల్లో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఆర్టీసీ ఈనెల 8 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, ఖమ్మం వంటి ప్రాంతాలకు రిజర్వేషన్ బస్సులు వెళ్తుంటాయి. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వాటితో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులకు సైతం ఛార్జీలను వసూలు చేస్తోంది.
ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ - విజయవాడ జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పరిధిలోని రెండు బస్సులపై కేసులు నమోదు చేసి రూ.14,000ల జరిమానా విధించారు. దసరా పండుక పూర్తయ్యే వరకు నిరంతరం తనిఖీలు చేపడతామని.. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు.
ఇదీచూడండి: Bus Charges: దసరా రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్