ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.46ను తీసుకొచ్చింది. అంతకుముందు ఏడాది ఫీజులే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ఉత్తర్వులు సరిగా అమలు కాలేదనే విమర్శలున్నాయి. తాజాగా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తొలి విడత ఫీజులను ఈ నెల 15లోగా చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ సారి ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఏకంగా 20-30 శాతం పెంచి తల్లిదండ్రులకు నోటీసులు ఇస్తున్నాయి.
పరీక్షలు ఉంటాయా.. ఉండవా..?
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు ఉంటాయా.. ఉండవా.. అన్న విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పరీక్షలు లేకుండా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో ఇక్కడ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. ప్రైవేటు యాజమాన్యాలు సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కృష్ణ..స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో(సీబీఎస్‌ఈ) కుమారుడిని ఎనిమిదో తరగతి చదివిస్తున్నాడు. అతనికి వేరేచోటికి బదిలీ కావడంతో కుమారుడి టీసీ కోసం వెళ్లాడు. ఇప్పటికే క్లాసులు ప్రారంభించామని, టీసీ కావాలంటే పుస్తకాలు తీసుకోవడంతోపాటు 2021-22కి సంబంధించి మొదటి విడత ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ మెలిక పెట్టడం గమనార్హం.
మెట్టుగూడకు చెందిన మనీష్ కుమార్తె సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఆన్‌లైన్‌లోనే చెప్పినా..పూర్తి ఫీజు రూ.54 వేలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే ప్రమోట్ చేయమని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తోంది.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..
తొమ్మిదో తరగతి వరకు పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అందర్నీ ప్రమోట్ చేయాలి. ఆన్‌లైన్ తరగతులకు ప్రత్యక్ష బోధన తరహాలోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేశాం. జీవో నం.46 ఉల్లంఘన జరగుతోందని చెప్పినా, చర్యలు శూన్యం.
- వెంకట్ సాయినాథ్, సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం
ఇవీ చూడండి: 'ఆ యాప్‌తో 33 రకాల వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు'