రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొంతమంది కార్డుల లిమిట్‌ను ఒక్కసారిగా సగానికి తగ్గించేశాయి. లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో స్పష్టత లేదు. ముందస్తు చర్యల్లో భాగంగా క్రెడిట్ కార్డుల అప్పులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బిల్లులు చెల్లించడం లేదని బ్యాంకులు ఆందోళనలో ఉన్నాయి.
చెల్లింపులపై సందేహంతోనే..!
నగరంలో ఉండే చిరు వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్లలోనే ఉంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చి బ్యాంకులు కార్డుల విలువను తగ్గిస్తున్నాయి. నగరంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు సుమారుగా 40 లక్షల వరకు ఉంటారని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. డబ్బులు వినియోగించుకున్న తర్వాత తిరిగి చెల్లిస్తారా..? లేదా అనే సందేహాలతో కార్డుదారులపై ప్రైవేటు బ్యాంకులు ఈ మేరకు కోతలు పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.