MODI PUBLIC MEETING AT VISAKHA: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. కొన్ని నెలల కిందట అల్లూరి జయంతి వేడుకలకు వచ్చే సౌభాగ్యం కలిగిందని తెలిపారు. భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోదీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు.
వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు. అంతకుముందు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవానికి ముందు విశాఖలోని ఆంధ్ర యూనివర్శటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికపైకి చేరుకున్న ప్రధానిని ముఖ్యమంత్రి జగన్ శాలువాతో సత్కరించారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వందేభారత్ రైలు: గత 8 ఏళ్లుగా రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లు, ప్లాట్‌ఫాంలు, సౌకర్యాల కల్పన మరింత పెరిగిందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌లో అనేక మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. రూ.446 కోట్లతో విశాఖ రైల్వే ఆధునీకరణ చేపట్టామని.. మోదీ నాయకత్వంలో వందేభారత్ రైలు కల సాకారమైందని పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వందేభారత్ రైలు వస్తుందని ప్రకటించారు. 2014కు ముందు ఏపీకి రూ.986 కోట్లే వచ్చాయని.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రూ.7,032 కోట్లు వచ్చాయని తెలిపారు.
ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన జగన్: విశాఖలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జనసముద్రం కనిపిస్తోందని.. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతూ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర జనం.. ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చిందని వెల్లడించారు. విజయనగరం వాసి మహాకవి గురజాడ మాటలు కర్తవ్య బోధ చేస్తున్నాయని తెలిపారు. ఇవాళ దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో తమ ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని పేర్కొన్నారు.
మీరు చూపే ప్రేమను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు: రాష్ట్రానికి మరిన్ని సహయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలిపారు. విభజన గాయాల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునఃనిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం.. పార్టీలు, రాజకీయాలకు అతీతమని సీఎం తెలిపారు.
తమకు..రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదని స్పష్టం చేశారు. పెద్దమనస్సుతో మీరు చూపే ప్రేమను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశామన్న సీఎం.. రాష్ట్ర విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: