ఉల్లి ధరలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో నాణ్యమైన పెద్ద ఉల్లిగడ్డల చిల్లర ధర రూ.40 నుంచి 55 వరకూ పలుకుతోంది. నెలరోజుల క్రితంతో పోలిస్తే పలు ప్రాంతాల్లో రూ.20 నుంచి 30 దాకా పెరిగింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక ఉల్లి ధరల ప్రభావం ప్రజలపై పడింది.
నిషేధం..
నిత్యావసర సరకుల నిల్వ, నియంత్రణపై ఆంక్షలు, నియంత్రణను పూర్తిగా తొలగిస్తూ కొత్త చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీంతో పంట నిల్వలను బయటకు తీయకుండా వ్యాపారులు నియంత్రిస్తున్నారు. ధర పెరుగుతున్నందున పక్షం రోజుల క్రితం ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) వద్ద 56 వేల టన్నుల నిల్వలున్నాయి. వీటిని కిలో రూ.25లోపే విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి.
ఎందుకీ కొరత..
దేశంలో 12.63 లక్షల హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతోంది. గతేడాది(2019-20)లో దేశవ్యాప్తంగా 2.44 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. ఎక్కువగా ఉల్లి సాగుచేసే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో వర్షాలు బాగా కురవడంతో ఖరీఫ్ పంట పాడైంది.
ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో విదేశాలకు 1.20 కోట్ల టన్నులు ఎగుమతి చేశారు. దేశంలో నాణ్యమైన పంటకు కొరత ఏర్పడి క్వింటా టోకు ధర రూ.2 వేల నుంచి 4 వేల వరకూ పెరిగింది. వానాకాలంలో ఏపీలో 15 వేలు, తెలంగాణలో 5500 హెక్టార్లలో ఉల్లి సాగైంది. లాక్‌డౌన్ సమయంలో పంట కొనేవారు లేక పంటను పొలాల్లో వదిలేశారు. ఇప్పుడు రైతుల వద్ద పంట లేకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస ప్రణాళిక!