ఏపీలోని జమదంగి గిరుల్లో నివసించే మన్యం బిడ్డలు.. వైద్యం కావాలంటే బోయితలి ప్రాంతానికి నడిచి వెళ్లాల్సిందే. సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న ఆ ప్రాంతానికి.. లక్ష్మి అనే గర్భిణిని ఆమె కుటుంబీకులు నడిపించి తీసుకెళ్లారు. అంతా కొండ మార్గమే. ఎగుడు దిగుడు దారుల్లో ఆ ప్రయాణం అడుగడుగూ నరకప్రాయమే. అయినా.. కడుపులో ఉన్న బిడ్డ కోసం కష్టానికి ఓర్చుకుంది. బోయితలికి వెళ్లి ఆర్ఎంపీ వైద్యుడికి చూపించుకుని.. తిరిగి అదే దారిలో ఇంటికి బయల్దేరింది. ఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. ప్రసవవేదనను భరించలేకపోయింది. చేసేదిలేక.. డోలి కట్టి లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లారు కుటుంబీకులు. అప్పటికే పరిస్థితి విషమించింది. లక్ష్మి ప్రసవించింది. తీవ్ర రక్తస్రావమైంది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు.. తల్లి కూడా ప్రాణం విడిచింది. ఉపాధ్యాయుడు దాసు బాబు.. వారాంతంలో పాడేరుకు వెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లక్షి, ఆమె బిడ్డల మరణ వార్త.. మన్యం దాటి బయటికి వచ్చేందుకు 5 రోజులు పట్టింది.
పాపం ఇమాన్యుయేల్!
మన్యంలో సరైన వైద్యం అందక ప్రాణం విడిచిన లక్ష్మికి.. ఇంతకుముందే ఓ కుమారుడు ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. ఇటీవల తన ప్రతిభతో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ పిల్లాడే ఇమాన్యుయేల్. తల్లి మరణం.. ఆ బాబును విషాదంలో ముంచింది. అసలు తన తల్లి ఎలా మృతి చెందిందో అర్థం చేసుకోలేని ఆ పసి హృదయం పడుతున్న ఆవేదనకు.. అంతా తల్లడిల్లిపోతున్నారు.