ప్రతి ఏడాది శీతాకాలంలో భారత రాష్ట్రపతి దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయితీ. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఇక్కడకు వచ్చి వివిధ ప్రాంతాల్లో పర్యటించడం, కార్యక్రమాల్లో పాల్గొనడం కొనసాగుతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో దక్షిణాది విడిది సందర్భంగా బస చేస్తుంటారు. నిరుడు కొవిడ్ కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ శీతాకాల విడిదికి రాలేదు. ఈ మారు రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నెల నాలుగో వారంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు.
నాలుగైదు రోజులపాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. రాష్ట్రపతి పర్యటన సమాచారం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోటోకాల్ శాఖ తరపున పనులు వేగవంతం చేశారు. దేశ ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం పలికేందుకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు ఒక దఫా సమావేశమయ్యారు. ఆక్టోపస్ విభాగం రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. ఎటువంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కసరత్తు ద్వారా సందేశం ఇచ్చింది. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 2022లో ముగియనుంది. దీంతో అధికారికంగా ఇదే ఆయనకు చివరి దక్షిణాది విడిది కానుంది. దేశ ప్రథమపౌరుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చదవండి:
Cm Kcr Today News: సీఎం కేసీఆర్ గద్వాల టూర్... మధ్యలో రైతులతో మాటామంతీ