President Draupadi Murmu Comments : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కాలేజీ విద్యార్ధులు, లెక్చరర్లతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేశవ్ మెమోరియల్ సొసైటీ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ పోరాట యోధులను.... ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భవిష్యత్తు తరాల కోసం వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని రాష్ట్రపతి విద్యార్థులను కోరారు. నూతన విద్యా విధానం సృజనాత్మకతను మేల్కొలుపుతుందని, దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకునేందుకు ఎక్కువ చదవాలని విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ అవకాశాలకు కేంద్రంగా ఉందని..వాటిని అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
''ఐటీ, ఇతర రంగాల్లో హైదరాబాద్ ఎన్నో అవకాశాలకు నెలవైన నగరం. ఎన్నో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో ప్రజలు నివసించడానికి అనువైనది. అత్యున్నతమైన సంస్కృతి, భిన్నమైన సంప్రదాయాలకు చెందిన వారికి నిలయమైన హైదరాబాద్.. కొత్త ఆలోచనలకు కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ భిన్నత్వమే హైదరాబాద్‌కు ఉన్న బలం. ఇదే దేశానికి ఎంతో అందిస్తోంది. ఈ నగరంలో ఉన్న అవకాశాలను మీరు అందుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.'' - ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి వెళ్లిన రాష్ట్రపతి ముర్ము.. ఐపీఎస్ శిక్షణ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని... దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వారి సేవలు అమూల్యమని కొనియాడారు. పోలీసులకు... అప్రమత్తత, నిజాయితీ, సున్నితత్వం అవసరమని సూచించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పీడితులు, బలహీనవర్గాలకు పోలీసులు అండగా నిలవాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఏ విభాగంలోనైనా మహిళల భాగస్వామ్యం సత్ఫలితాలను ఇస్తుందని.. అన్ని విభాగాల్లో వారిని ప్రోత్సహించాలని కోరారు.
అమృత కాలంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో నారీశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల మహిళ ఓటర్ల శాతం భారీగా పెరగడం... భారత ప్రజాస్వామ్యం సాధించిన అతిపెద్ద విజయం. మహిళలు అన్ని విషయాల్లో దృఢంగా మారేందుకు దేశ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.. సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. స్కాండినేవియా దేశాల్లోని పోలీసుల్లో 30శాతం మంది మహిళలే ఉంటారు. ఆ దేశాలు మానవాభివృద్ధి సూచికల్లోనూ మెరుగ్గా ఉన్నాయి. మహిళలకు సాధికారత కల్పించడం నుంచి అతివలే అభివృద్ధికి నాయకత్వం వహించే దశకు మనం త్వరగా చేరుకుంటున్నాం. కొన్ని రంగాల్లో అది ఇప్పటికే సాధ్యమైంది. నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉండటం. మహిళా పోలీసు అధికారులు దుర్భర పరిస్థితుల్లో ఉన్న తోటి స్త్రీలకు సాయపడా . అప్పుడు సమాజంలో గొప్ప మార్పు కనబడుతుంది. -ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ సందర్శన తర్వాత మిధానిని వెళ్లిన రాష్టపతి ద్రౌపది ముర్ము... అక్కడ వైడ్ ప్లేట్ మిల్‌ని ప్రారంభించారు. అక్కడి విశేషాలను మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా... రాష్ట్రపతికి వివరించారు.
ఇవీ చదవండి: