రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ఇంటింటినీ చుడుతున్నారు. ప్రచార గడువు రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ప్రచార గడువు ముగిసి, పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లపై పడింది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న పోలింగ్ జరగనున్న తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 కారోరేషన్లు, 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ పదవులకు ఓటింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు.
కరీంనగర్లో మాత్రం బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పోలింగ్ సిబ్బందికి రెండో దఫా శిక్షణ కూడా పూర్తైంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్‌కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న వీలైనంత త్వరగా పోలింగ్ కేంద్రాలకు సరంజామాను చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ లేని చోట వీడియోగ్రఫీ చేయించనున్నారు.
ఇదీ చూడండి : కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి