Precautions for Kids Flying Kites : సాధారణంగా పతంగులు ఎగురవేసేందుకు బంగ్లాలు ఎక్కి ఎగురవేస్తుంటాం. లేదా ఖాళీ మైదానాల్లో ఎగురవేస్తుంటాం. అయితే ఈ క్రమంలోనే పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పతంగులు ఎగురేయడమంటే సరదాగానే ఉంటుంది కానీ, కాస్త ఏమరపాటుకి గురైతే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది. శనివారం రోజున రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగరమంతా పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. గాలిపటం ఎగరేసేందుకు తనిష్క్(Tanishq) అనే 11 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో పాటు మేడ పైకి వెళ్లాడు.
పతంగి ఎగరేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన తనిష్క్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వెంకటేశ్వర కాలనీలో సైతం గాలిపటం ఎగరవేస్తూ జోహేల్ (Joel)అనే 12 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ - ప్రారంభించిన మంత్రులు జూపల్లి, పొన్నం
Officers Instructions over Kite Flying : ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌శాఖ వారు పలు జాగ్రత్తులు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు లేని చోట పతంగులు ఎగురవేయాలనంటున్నారు. మాంజా దారాలు(Manja thread) విద్యుత్‌లైన్లపై పడితే సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మెటాలిక్ మాంజాలు విద్యుత్‌వాహకాలు కాబట్టి వాటిని వాడే క్రమంలో అవి విద్యుత్ తీగలకు తగిలితే షాక్ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పతంగి సంబురం కావొద్దు విషాదం : కైట్స్ విద్యుత్ తీగలకు చిక్కుకుంటే వాటిని వదిలేయాలని వాటికి తిరిగి తీసుకునే సాహసం చేయవద్దని సూచిస్తున్నారు. పిల్లలు పతంగులు ఎగురవేస్తుంటే తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని కోరుతున్నారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు ఉన్నా, వాటిని తాకకుండా వెంటనే 1912 కి గాని లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి గాని లేదా సంస్థ మొబైల్ ఆప్ ద్వారా గాని లేదా సంస్థ వెబ్సైటు www.tssouthernpower.com ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు.
పండుగ ఆనందంగా జరిగే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అప్రమత్తత తప్పనిసరి. సంక్రాంతి సంతోషాలు కలిగించేలా ఉండేలా అందరూ జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగురవేయాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడికి కరెంట్ షాక్
సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?