హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యుడు డా.జి.వివేక్ ఆధ్వర్యంలో సింగరేణి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు ప్రాంతాలకు చెందిన సింగరేణి కార్మిక సంఘాల నాయకులు భాజపా కార్మిక సంఘం భారతీయ మాజ్దుర్ సంఘ్‌లో చేరారు. సంఘ్‌లో చేరిన వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. సింగరేణిని సీఎం కేసీఆర్ అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస పార్టీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. ముఖ్యమంత్రి హామీలు నీటి మీద రాసిన మాటలుగా మారాయని విమర్శించారు.
సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం
సీఎం మాటలు ప్రగతి భవన్ దాటడం లేదన్నారు. కార్మికులు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. సింగరేణి లాభాల్లో ఉందని మేనేజ్మెంట్ ప్రకటిస్తున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఆధీనంలో పెట్టుకుందని అన్నారు. తెరాస ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసిందని, రాష్ట్ర ప్రజలు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తే తెరాసలో చేరుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆ మార్పు సింగరేణి నుంచే రావాలని ఆయన అన్నారు.
ఇదీ చూడండి : అక్కరకు రాని ప్లాస్టిక్‌తో.. పనికొచ్చే వస్తువులు