రాష్ట్రంలో తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో యువకులు ప్రగతి భవన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు.
మంచిర్యాలలో నిరుద్యోగి ఆసంపల్లి మహేశ్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని శివసేన రెడ్డి ఆరోపించారు. విద్యార్థి, యువకుల త్యాగాలతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్.. ఆ తర్వాత వారి త్యాగాలను విస్మరించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత నిరుద్యోగుల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు.
ప్రభుత్వంపై నమ్మకం లేకనో ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని ముఖ్యమంత్రి మోసం చేశారని, యువత రోజురోజుకూ నిరుత్సాహంలో కూరుకుపోవడానికి కేసీఆర్ తీరే కారణమని ఆరోపించారు.
తెలంగాణను మత్తుకు బానిసగా చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని శివసేన రెడ్డి ఆరోపించారు. వచ్చే నెలలో మద్యంషాపుల టెండర్ల కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆసంపల్లి మహేశ్ కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గోషామహాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: digital membership registration: కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం షురూ...