తాగునీటి రంగంలో మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కేంద్ర బృందం సమావేశమైంది. పథకం లక్ష్యాలు, డిజైన్, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మిషన్ భగీరథ పనులు, అనుమతులపై కేంద్ర బృందానికి ఈఎన్సీ కృపాకర్ రెడ్డి వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు శుద్ధిచేసిన నీరు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఇంటికీ నల్లా నీటిని సరాఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అజయ్ కుమార్ కొనియాడారు. ఇతర రాష్ట్రాలు మిషన్ భగీరథ నమూనాను అనుసరిస్తున్నాయని చెప్పారు. అజయ్ కుమార్ నేతృత్వంలోని జల్ జీవన్ మిషన్ బృందం సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో మిషన్ భగీరథ తీరుతెన్నులను పరిశీలించనుంది.