Republic Day Celebrations in Telangana : 74వ గణతంత్ర వేడుకలను రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించాయి. భారత్ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో నిజమైన లౌకికవాదాన్ని అమలు చేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్ అని మహమూద్ అలీ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, ఎన్.ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి.. రాజ్యాంగం, కోర్టులు, గవర్నర్‌పై గౌరవం లేదని నేతలు మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సీఎం నిజాం పోకడలను అవలంభిస్తున్నారని.. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదని ఆక్షేపించారు.
గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారు..: గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు జెండాకు వందనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక కష్టానష్టాల కోర్చి సాధించిన ప్రగతిని ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరోగమనంలోకి నెట్టేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.
రిపబ్లిక్ డే ను ప్రగతిభవన్, రాజ్‌భవన్‌కే పరిమితం చేశారని విమర్శించారు. గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారని దుయ్యబట్టారు. గవర్నర్, సీఎం మధ్య విభేదాలుంటే మరో వేదికపై ప్రదర్శించాలని సూచించారు. కేసీఆర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని.. కేసీఆర్ వెంటనే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాజ్యాంగపరమైన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జెండాను ఎగురవేశారు. గణతంత్ర వేడుకలపై కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ప్రభుత్వానికి గుర్తు రాలేదని ఆక్షేపించారు. గవర్నర్‌తో వ్యక్తిగత విబేధాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ పరమైన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించాలని ఆయన సూచించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం తెలంగాణ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీర్‌పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఇవీ చూడండి..
అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన ముర్ము.. హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
ప్రగతిభవన్‌లో గణతంత్ర వేడుకలు.. మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన కేసీఆర్