Political Parties on Medigadda Barrage Issue : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోంది. సరైన భూపరీక్షలు లేకుండానే రూ.వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మించారని బీజేపీ ఆరోపించిది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Etela fires on KCR : ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని.. బండి సంజయ్ విమర్శించారు. కమీషన్‌ల మీదున్న శ్రద్ధ.. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతలో చూపకపోవడం వల్లే ఈ పరిస్థతి వచ్చిందని దుయ్యబట్టారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యుడు సీఎం కేసీఆరేనని.. ప్రాజెక్టు నిర్మాణ నష్టాన్ని కల్వకుంట్ల కుటుంబం నుంచే వసూలు చేయాలన్నారు.
"మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా ఇసుక మేటపై నిర్మించారు. నది ప్రవాహానికి ఇసుక పోవడంతో బ్యారేజీ కుంగింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత.. సీఎం కేసీఆరే వహించాలి. డ్యాం వద్ద అసలు సమాచారం బయటకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి". - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
"మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత. డ్యాం కుంగిపోవడం నిజంగా హాస్యాస్పదం. తానే ఇంజినీర్‌గా చెప్పుకునే కేసీఆర్.. మేడిగడ్డ ఘటనపై స్పందించాలి. డ్యాం కుంగుబాటుపై సమగ్ర విచారణ జరపాలి". - బండి సంజయ్ , బీజేపీ ఎంపీ
Congress Reacts on Medigadda Incident : మేడిగడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్ల కుంగుబాటుపై బీఆర్‌ఎస్ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఆరోపణలను మరింత పెంచింది. కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యారేజీకి తానే ప్లాన్ చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ఘటనకు బాధ్యత వహించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
"కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం కుంగుబాటు ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలి". - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కో-ఛైర్మన్
BSP Reacts on Medigadda Incident : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం సంబంధించి అంతర్జాతీయ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులో రీడిజైన్ పేరిట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి బ్యారేజీ కట్టామని గొప్పలు చెప్పిన కేసీఆర్ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.