Police Use Dogs to Check Pubs for Drugs in Hyderabad : రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పబ్‌ల(Pubs) నుంచే ఎక్కువగా మత్తు మహమ్మారి విస్తరిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పబ్‌లపై ఆకస్మిక తనిఖీలకు ఉపక్రమించారు. తొలిసారిగా మాదకద్రవ్యాలను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను పోలీసులు వినియోగిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస్‌న్యాబ్‌కు పూర్తిస్థాయి సంచాలకుడిని నియమించారు. దీంతో పోలీసుశాఖ మత్తు పదార్థాల కట్టడిపై కార్యాచరణను ప్రారంభించింది. ముందుగా హైదరాబాద్‌లోని పబ్‌లపై పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కువగా పబ్‌ల ద్వారానే పలువురు మత్తుకు బానిసలుగా మారుతున్నారని పలు ఘటనల్లో నిరూపితమైంది.
మత్తు పదార్థాల తనిఖీకి స్నిఫర్ డాగ్స్ : ఇలా పోలీసులకు పట్టుబడిన పలువురు నైజీరియన్లు సహా ఇతర మత్తు ముఠాల సంబంధాలు పబ్‌లతో ఉండడంతో, ఇక్కడ తనిఖీలు విస్తృతం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 10, 36, 45 లోని పబ్‌లలో తనిఖీలు చేశారు. సోదాల కోసం పోలీసులు మొదటిసారిగా స్నిఫర్ డాగ్స్(Sniffer Dogs)ను వినియోగించారు. ఈ డాగ్స్‌కు మత్తు పదార్థాల వాసన పసిగట్టి వాటిని సులభంగా గుర్తించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే జాగిలాలను తనిఖీల్లో భాగం చేశారు.
రూ.3 కోట్లు విలువ చేసే మత్తుపదార్ధాలు స్వాధీనం - డ్రగ్స్ దందాపై పోలీసుల ఉక్కుపాదం
Police Serch for Drugs with Sniffer Dogs in Pubs : ఇప్పటి నుంచి పబ్‌లలో తరచూ సోదాలు కొనసాగిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఏదైనా పబ్‌లో మత్తు పదార్థాలు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని, అనుమతి కూడా రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మత్తు పదార్థాల(Drugs) రవాణాపై కూడా పోలీసుశాఖ దృష్టి సారించింది. బాహ్యవలయ రహదారితో పాటు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలను ముమ్మరం చేయనుంది. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. అలాగే మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారితో పాటు వినియోగించే వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
డ్రగ్స్ పరీక్షలకు ప్రత్యేక టెస్ట్ కిట్లు : రేవ్ పార్టీకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటే డి-అడిక్షన్ క్యాంప్‌నకు పంపి పరీక్షలు చేశాకే బయటకు వదులుతామని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బ్రీత్ ఎనలైజర్ పరీక్ష తరహాలో డ్రగ్స్ పరీక్షలకు కూడా త్వరలో ఫీల్డ్ లేదా పోర్టబుల్ డ్రగ్ డిటెక్షన్ కిట్లు వినియోగిస్తామని చెప్పారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనలో అందరూ సహకరించాలని, టీఎస్ న్యాబ్ హెల్ప్‌లైన్ 8712671111, లేదా ఈ మెయిల్ tsnabhyd@tspolice.govకు సమాచారం అందించాలని సందీప్ శాండిల్య కోరారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్న సీఎం రేవంత్ - ఖండించిన కేటీఆర్
సచివాలయంలో సీఎం వరుస సమీక్షలు - రైతుబంధు నిధుల విడుదల, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలు