Congress Leaders House Arrest: కాంగ్రెస్ నేతల ఎర్రవల్లి పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో ఇవాళ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆయన వెళ్లకుండా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
రైతులను నిండా ముంచుతున్నారు..
రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, సంపత్ కుమార్ ఇళ్ల వద్ద కూడా పోలీసులను మోహరించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని… ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడు వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుతున్న కేసీఆర్.. రైతులను నిండా ముంచుతున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు.
మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం..
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంటలు వేశారని.. ఆ అంశాన్ని మీడియాకు చూపిస్తానని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిద్ధిపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే మంత్రుల, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: Revanth Reddy On CM Kcr: ధాన్యం కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం: రేవంత్ రెడ్డి