ద్విచక్ర వాహనాల్లో దొంగతనాల్లో ఆరితేరిన ఇద్దరు వ్యక్తులను ఏపీ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ 108 వాహనాలను చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కావిడి నాని సింగం, బండి శివ వరుసకు సోదరులు.
కూలిపని చేసుకునే వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బులు సరిపోక ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో మహారాష్ట్రలో రెండు ద్విచక్ర వాహనాలు దొంగలించి పోలీసులకు పట్టుబడ్డాడు సింగం. అతనిపై అనుమానం వచ్చిన ఆలమూరు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు.
నిందితులిద్దరూ ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 108 వాహనాలు చోరీ చేసినట్లు గుర్తించారు. వీరు దొంగిలించిన వాహనాలను మడికి గ్రామానికి చెందిన కతేటి చిన్న, సింగం హరి దుర్గా ప్రసాద్, కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన చింతల లావరాజు, రాజనగరం మండలానికి చెందిన గుత్తుల శ్రీనులు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు.
నిందితులతో పాటు వారికి సహకరించిన నలుగురిని ఆలమూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: డబ్బులు లెక్క కాదు... ప్రజల ఆరోగ్యమే ముఖ్యం: ఈటల